
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీనియర్ నేత వీ హనుమంతరావు చురకలు అంటించారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలు బంద్ చేయాలని అన్నారు. ఎన్నికలయ్యే వరకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. లేదంటే కింది స్థాయిలో నేతలు ఇబ్బంది పడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జోష్ వచ్చిందని చెప్పారు. టికెట్ల సంగతి పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, రాహుల్ గాంధీ, వేణు గోపాల్‌లు చూసుకుంటారని చెప్పారు. ఆ పంచాయితీ పక్కన పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇందుకోసం అందరం కలిసి పనిచేయాలని పిలపునిచ్చారు. ఇప్పటికే 8 ఏళ్లు ఇబ్బంది పడ్డామని.. కాంగ్రెస్ విజయం కోసం ముందుకు సాగాలని లేకపోతే మరో 5 ఏళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కూడా వీహెచ్ స్పందించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర అనగానే భయపడ్డానని చెప్పారు. రాహుల్ గాంధీ ధైర్యంగా పాదయాత్ర చేశారని అన్నారు. ఇప్పుడు ఆర్‌ఎస్ఎస్ వాళ్లు పప్పు కాదు.. పప్పా అంటున్నారని అన్నారు.