
హైదరాబాద్: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఓటింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ శాతం ఎలా పెరుగుతుందంటూ మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోక్ సభ ఎన్నికల్లోనూ జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాలపై త్వరలోనే అన్ని పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పోలింగ్ శాతంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కొన్ని వివరాలు అడిగినట్లు చెప్పుకొచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే వివరాలను బట్టి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను భద్రపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ పై తమకు అనుమానాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.
రజత్ కుమార్ వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి లభ్ధి చేకూరేలా రజత్ కుమార్ వ్యవహరించారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో తమకు కలిగిన అనుమానాలపై అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.