
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం కేరళ పర్యటనకు వెళ్లారు. కాగా... ఆయన ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా... ఓటు వేయకుండానే కేరళ వెళ్లడం గమనార్హం.
స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడుతలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కాగా... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయకుండానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసేందుకు కేరళ వెళ్లారు. ఈ ఎన్నికల్లో నారాయణరావుపేట మండలం నుంచి జెడ్పీటీసీ, చింతమడక నుంచి ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులూ పోటీలో ఉన్నారు.
కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రమం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో కేరళ బయలుదేరి వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో తిరువనంతపురంలో ఆయన సమావేశం కానున్నారు. మొత్తం వారం రోజుల పాటు.. కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలో పాల్గొననున్నారు.