అభిమానులు నన్ను సీఎం కావాలనుకుంటున్నారు: జానారెడ్డి

By Nagaraju TFirst Published Oct 12, 2018, 6:28 PM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన జానారెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనిచేసేలా కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలపై ప్రజలకు సమాధానం చెప్పలేకనే ముందస్తుకు వెళ్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలను డబ్బుతో కొనాలని భావిస్తున్నాడని ఆరోపించారు.  

నల్లగొండ: టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన జానారెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనిచేసేలా కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలపై ప్రజలకు సమాధానం చెప్పలేకనే ముందస్తుకు వెళ్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలను డబ్బుతో కొనాలని భావిస్తున్నాడని ఆరోపించారు.  

టీడీపీతో పొత్తుపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని జానారెడ్డి అన్నారు. చంద్రబాబు పేరుతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఓ మాయల మరాఠీ అని, ఆయన మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేసీఆర్‌ ఎవరితో జత కట్టినా తప్పులేదా? అని ప్రశ్నించారు. 

టీడీపీ పొత్తుతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగదని, అభివృద్ధికి ఆటంకం ఉండదని జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ అంటే చంద్రబాబుది కాదని, ఇక్కడ ఉన్న టీడీపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలదేనని పేర్కొన్నారు. 

కాంగ్రెస్, టీడీపీ కలవడంతో తమ గోచీ ఊడుతుందన్న భయంతో కేసీఆర్ వణికపోతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్లే పరుష పదాలతో దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. నెహ్రూ, సోనియా గాంధీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ఓటమి బాధతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. నల్గొండ జిల్లాలో తాము చేసిన అభివృద్ధిని మరెవరూ చేయలేదని భవిష్యత్‌లో కూడా చేయబోరన్నారు.
 
మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిత్వం అధిష్టానం చూసుకుంటుందని జానా స్పష్టం చేశారు. అయితే అభిమానులు తనను సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం అభ్యర్థి ఎన్నిక ఉంటుందని తెలిపారు. తన మారుడు రఘువీర్ రెడ్డి కోసం సీటు అడుగుతున్నట్లు చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకే తాను, తన కుమారుడు ఎక్కడి నుంచి పోటీ అనేది తేలుతుందన్నారు.

click me!