
Mallikarjun Kharge: బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించే పారదర్శకమైన, ప్రజాహిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. నేడు తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కట్టారు.
ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్ఖున ఖర్గే ట్వీట్ చేస్తూ.. "తెలంగాణ ప్రజలు పారదర్శకమైన, ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో వచ్చిన ఆలోచనను భూమిపై ఏ శక్తీ ఆపదు’ అని ట్విట్ చేశారు. ‘ప్రజల తెలంగాణకు ఇప్పుడు భరోసా ఇద్దాం! వారి కలను సాకారం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో ఓటు వేయాల్సిన సమయం ఇది. తెలంగాణ ప్రజల లెక్కలేనన్ని కలలు, ఆకాంక్షలను సాకారం చేయాల్సిన సమయం ఇదేనని, దాని కోసం మీరు ఇన్నాళ్లు చెమటలు, రక్తాన్ని చిందించారని ఆయన అన్నారు.
బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించే పారదర్శకమైన, ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.మార్పు, సామాజిక న్యాయం కోసం ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి ఓటర్లను స్వాగతిస్తున్నని కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. పోస్ట్ చేస్తూ.. "ఈరోజు ప్రజలు దొరలను ఓడిస్తారు! తెలంగాణ సోదర సోదరీమణులారా, బయటకు వచ్చి పెద్ద సంఖ్యలో ఓటు వేయండి! 'బంగారు' తెలంగాణను నిర్మించడానికి ఓటు వేయండి, కాంగ్రెస్‌కు ఓటు వేయండి అని పిలుపునిచ్చారు.
అలాగే.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ.. "ఆలోచించి, పూర్తి ఉత్సాహంతో,శక్తితో ఆలోచించి ఓటు వేయాలని (తెలంగాణ ప్రజలు) విజ్ఞప్తి. ఓటు వేయడం మీ హక్కు, అతిపెద్ద బాధ్యత. తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చండి. ఓటు శక్తి. ముందుగా అభినందనలు. జై తెలంగాణ. జై హింద్." అని రాసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.