
Telangana Elections 2023: కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 13 లెఫ్ట్ వింగ్ తీవ్రవాద (LWE) ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకుపోలింగ్ ముగియనుంది.
ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మెదక్ లో 9 శాతం, దుబ్బాకలో 10 శాతం, నర్సాపూర్ లో 9 శాతం, గజ్వెల్ లో 10 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అయితే, బెల్లంపల్లి నియోజకవర్గంలోని వరిపేటలో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. ఒక్క ఓటరు కూడా లేకపోవడంతో పోలింగ్ కేంద్రం ఖాళీగా కనిపిస్తోంది.
ఓటర్లు లేక ఖాళీగా కనిపిస్తూ వరిపేట పోలింగ్ కేంద్రం వెలవెలబోతున్నది. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలోని ప్రజలు ఎన్నికలను బహిష్కరించడమే. తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగానే చాలా మంది ఓటు వేయడానికి దూరంగా ఉన్నారు. ఉదయం 9.30గంటల వరకూ కేవలం 12 మంది ఓటర్లు మాత్రమే ఈ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారని సమాచారం.