
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్పెషల్ ఫోకస్ పెట్టిన తెలంగాణలో కీలక సమావేశాలు నిర్వహించే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సోమవారం వెల్లడించారు. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పంచుకుంటూ ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హెడ్‌క్వార్టర్స్‌లో కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన సీడబ్ల్యూసీ తొలి భేటీని హైదరాబాద్‌లో నిర్వహించాలని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించినట్టు తెలిపారు. మరుసటి రోజున సీడబ్ల్యూసీతోపాటు అన్ని పీసీసీ లీడర్లు, సీఎల్పీ లీడర్లు, ఇతరులతో మరో సమావేశం ఉంటుందని వివరించారు.
అంతేకాదు, సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హామీలు ప్రకటించనున్నారు.
Also Read: Parliament: ప్రత్యేక సమావేశాల కోసం స్ట్రాటజీ గ్రూపుతో సోనియా గాంధీ కీలక భేటీ
కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కొత్తగా ఏర్పడిన సీడబ్ల్యూసీ తొలి సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి తెలంగాణ కాంగ్రెస్ టీమ్ రుణపడి ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలను భారీగా విజయవంతంగా చేస్తామని వివరించారు. ప్రజల పురోభివృద్ధి కోసం పని చేస్తామని పేర్కొన్నారు.
ఆగస్టు 20న కొత్త సీడబ్ల్యూసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కొందరు పాత నేతలను కొనసాగిస్తూనే పార్టీపై తిరుగుబావుటా ఎగరేసిన శశిథరూర్, ఆనంద్ శర్మల వంటి వారినీ చేర్చుకున్నారు. సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్ వంటి కొత్త ముఖాలను చేర్చుకున్నారు. 15 మహిళా నేతలకు సీడబ్ల్యూసీలో చోటుకల్పించారు. కాంగ్రెస్‌లో సీడబ్ల్యూసీ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ.