
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో ఐదో రోజు పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా షాద్‌నగర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రైతులు, నిరుద్యోగులు, మహిళలు తమ గోడు చెప్పుకుంటున్నారని.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ప్రజల గొంతు నొక్కేస్తున్నారని దుయ్యబట్టారు. జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోందని.. ఒక నది మాదిరిగా యాత్ర ముందుకు సాగుతోందని రాహుల్ అన్నారు. ఎలాంటి హింస లేకుండా యాత్ర నడుస్తోందని.. ఈ యాత్రను ఏ శక్తి ఆపలేదని ఆయన పేర్కొన్నారు. ఎండైనా, వానైనా , తుఫాన్ అయినా కాశ్మీర్ వరకు యాత్ర సాగుతుందని ఆయన చెప్పారు.
భారత్ గొంతు నొక్కే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని.. తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ పరమైందని యువత ఫిర్యాదు చేశారని రాహుల్ చెప్పారు. తమకు ఉద్యోగావకాశాలు లేక డెలివరీ, లేబర్ పనులకు వెళ్తున్నట్లు వారు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఈ ప్రభుత్వం నిలుపుదల చేసిందని రాహుల్ మండిపడ్డారు. లక్షలాది మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని.. చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు జీఎస్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలని.. గ్యాస్ ధర రూ.400 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారని రాహుల్ మండిపడ్డారు.
Also Read:భూదందా కోసమే ధరణీ పోర్టల్ : కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు
అంతకుముందు .. నిన్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు . రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్ధతు పలికిందని ఎద్దేవా చేశారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ... దేశాన్ని బలహీనపరుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ ఏం చేస్తోందో.. ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు.
రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారులతో మాట్లాడుతున్నానని.. తెలంగాణలో వాస్తవ పరిస్ధితుల్ని, వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని...జీఎస్టీ కారణంగా చేనేత కార్మికులు ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు అండగా కాంగ్రెస్ నిలబడుతుందని.. చేనేత కార్మికులకు జీఎస్టీ కష్టాలను తొలగిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. విద్యార్ధులకు చదువు భారమవుతోందని, నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.