కేసిఆర్ సర్కార్ జల్దీ తోకముడిచింది

First Published Nov 18, 2017, 1:09 PM IST
Highlights
  • ఎన్నిరోజులైనా సభ నడపుతామన్నారు
  • 16 రోజులకే తోక ముడిచారు
  • భజన కోసమే అసెంబ్లీ అన్నట్లుంది

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సర్కారు తీరుపై మండిపడ్డారు. ఎన్ని రోజులైనా సభ జరుపుతామని చెప్పిన సర్కారు పెద్దలు 16 రోజులకే తోక ముడిచారెందుకని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తే అధికార పార్టీ ఎదురుదాడి చేసిందన్నారు. ఏ సమస్యను ప్రశ్నించినా సమాధానం సరిగ్గా ఇవ్వలేదని విమర్శించారు. ఏది ప్రశ్నించినా గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు అనడం సరికాదని చురకలంటించారు.

అసెంబ్లీ సమావేశాలను పూర్తి అన్యాయంగా నడిపించారని మండిపడ్డారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైపల్యం చెందాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలవాలంటే కూడా సీఎం సమయం ఇవ్వరని విమర్శించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడుస్తుందన్నారు. నయీమ్ బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు. మియపూర్ ల్యాండ్ స్కామ్, ఎంసెట్ లికేజ్ పై చర్యలు ఏవని ప్రశ్నించారు. మెట్రోరైలు ఆలస్యం వల్ల 3వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు. మెట్రోరైలు ప్రాజెక్ట్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. శాసనసభలో జరిగిన అంశాలు మండలికి రావాలి కానీ శాసనసభ లో 31 జిల్లాల పై చర్చ జరుగుతుండగానే మండలి వాయిదా వేయడం విచిత్రంగా ఉందన్నారు.

అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యుల భజనలు మినహా ప్రజా సమస్యల పై చర్చించిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలు ఆధారాలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అధికార పక్షం బుల్డోజ్ చేశారని ఆరోపించారు. ఎన్ని రోజులయినా సమావేశాలు నడుపుతామని 16 రోజులకే అర్ధాంతరంగా సభను బంద్ చేసి అధికార పక్షం తోకముడిచిందన్నారు. 20 రోజులుగా సెర్ఫ్ ఉద్యోగులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ముఖ్యమైన అంశాలపై సభలో చర్చించకుండానే సభను ముగించడం దుర్మార్గమన్నారు.

click me!