కారణమిదీ:తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగ్గారెడ్డి భేటీ

By narsimha lode  |  First Published Feb 9, 2023, 4:14 PM IST

తెలంగాణ సీఎం  కేసీఆర్  తో  కాంగ్రెస్ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి  సమావేశమయ్యారు. 



హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో  కాంగ్రెస్ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి గురువారం నాడు భేటీ అయ్యారు.  అసెంబ్లీ హల్ లో  కేసీఆర్  తో జగ్గారెడ్డి  సమావేశమయ్యారు. తన నియోజకవర్గంలో అభివృద్ది పనులపై  కేసీఆర్ తో  చర్చించినట్టుగా జగ్గారెడ్డి  చెబుతున్నారు.   సంగారెడ్డికి మెట్రో రైలును  పొడిగించాలని  కేసీఆర్ ను కోరినట్టుగా జగ్గారెడ్డి  తెలిపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని  కాంగ్రెస్ ఎంపీలు కలిస్తే  తప్పు లేనిది  తాను  సీఎంను కలిస్తే  తప్పుందా అని ఆయన  ప్రశ్నించారు.ప్రధానిని  నేరుగా  కలిసేవాళ్లు నేరుగా  కలుస్తున్నారన్నారు.  ప్రధానిని చాటుగా కలిసేవారు చాటుగా కలుస్తున్నారని  జగ్గారెడ్డి  చెప్పారు.  

సంగారెడ్డిలో రాహుల్ గాంధీతో   పాదయాత్ర  చేయించిన రెండు రోజులకే  తనను కోవర్టు అంటూ  విమర్శలు  చేశారన్నారు. తనపై కొత్తగా  వచ్చే బద్నాం  ఏముంటుందని  ఆయన  ప్రశ్నించారు.  

Latest Videos

ఎమ్మెల్యేగా  సీఎం ను కలిస్తే  తప్పుందా అని  జగ్గారెడ్డి అడిగారు.  సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి   మెడికల్ కాలేజీ ఇవ్వాలని  గతంలో  జగ్గారెడ్డి  కోరారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీని  ప్రభుత్వం  మంజూరు చేసింది.  నియోజకవర్గ సమస్యలపై  మంత్రులు, ముఖ్యమంత్రిని  కలవడంలో తప్పు ఏముంటుందని  గతంలో కూడా  జగ్గారెడ్డి  ప్రశ్నించిన విషయం తెలిసిందే.   గతంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  విపక్ష పార్టీలకు చెందిన  ఎమ్మెల్యేలు కూడా కలిసిన సందర్బాలను కూడా జగ్గారెడ్డి  గుర్తు  చేసిన విషయం తెలిసిందే.  ప్రజా ప్రతినిధిగా  మంత్రులను కలవడాన్ని  జగ్గారెడ్డి సమర్ధిస్తుంటారు.

తాను బీఆర్ఎస్ లో  చేరాలనుకొంటే ఆపేవారు ఎవరున్నారని కూడా  జగ్గారెడ్డి  గతంలో  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  గతంలో బీజేపీ, బీఆర్ ఎస్ లలో  జగ్గారెడ్డి పనిచేశారు.  ఆ తర్వాత  ఆయన కాంగ్రెస్ పార్టీలో  చేరారు. 
 

 



 

click me!