కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో ఇవాళ భేటీ అయ్యారు.తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మాణిక్ రావు ఠాక్రే వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారంనాడు భేటీ అయ్యారు. హైద్రాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జగ్గారెడ్డి మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడుతారని జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.ఈ విషయమై జగ్గారెడ్డి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇవాళ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమై సోషల్ మీడియాలో వచ్చిన వార్తల విషయమై జగ్గారెడ్డి చర్చించినట్టుగా సమాచారం. తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
మాణిక్ రావు ఠాక్రేతో పాటు ఎఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరితో కూడ జగ్గారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీతోనే తన ప్రయాణమని ఆయన ప్రకటించారు.రాహుల్ ను సంగారెడ్డికి రావాలని ఆహ్వానించినట్టుగా జగ్గారెడ్డి మీడియాకు చెప్పారు.ఓ సామాజిక కార్యక్రమాన్ని రాహుల్ తో ప్రారంభించాలని జగ్గారెడ్డి కోరారు.
జగ్గారెడ్డి కొంత కాలంగా గాంధీ భవన్ కు కూడ దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో జగ్గారెడ్డి బీఆర్ఎస్ లోచేరుతారని ప్రచారం సాగింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఉద్యోగుల సంఘం నేతతో కలిసి జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల విషయమై కేటీఆర్ తో చర్చించినట్టుగా జగ్గారెడ్డి చెప్పారు.
సోషల్ మీడియాలో తనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలపై దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని జగ్గారెడ్డి గతంలోనే చెప్పారు. దీని వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కూడ ఆయన కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న వార్ రూమ్ నుండే ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్న విషయం పోలీసుల విచారణలో తేలింది.
ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీలోని ఓ కీలక నేత తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను బయట పెడతానన్నారు. బీఆర్ఎస్ లో చేరుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఠాక్రేకు వివరించారు.