
హైదరాబాద్: తనకు మంత్రి కావాలనే ఆశ లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే Jagga Reddy చెప్పారు. గురువారం నాడు సంగారెడ్డిలో నిర్వహించిన ఫాస్టర్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం నాకు మంత్రి పదవి ఇస్తానన్న తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. నాది డిఫరెంట్ మైండ్, డిఫరెంట్ క్యారెక్టర్ అని ఆయన చెప్పారు.తనకు పవర్ పై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. గెలుపును ఓటమిని ఒకేలా చూస్తానని చెప్పారు.
రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సీఎంగా ఉన్న సమయంలో పరిపాలనా విధానంలో, రాజకీయ వ్యూహాల్లో తనకు భాగస్వామ్యం ఉందన్నారు. అందుకనే తనకు పవర్ మీద పెద్ద ఆసక్తి లేదన్నారు. తాను గెలుపుని, ఓటమిని ఒకేలా చూస్తానన్నారు. అధికారం ఉన్నపుడు అన్నీ తెలుస్తాయని అనుకుంటామన్నారు. కానీ అధికారంలో ఉంటే కొన్నే తెలుస్తాయన్నారు. కొన్నిసార్లు అధికారం లేకపోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమన్నారు. గెలుపు ప్రజాసేవకు ఉపయోగపడుతుందని, ఓటమి అనుభవానికి ఉపయోగపడుతుందని జగ్గారెడ్డి చెప్పారు. . ఈ రెండూ ప్రతీ నాయకుడికి అవసరమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ Revanth Reddy తీరుపై జగ్గారెడ్డి ఇటీవల కాలంలో ఫైరయ్యారు. వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డికి చేసిన సవాల్ కు జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి తనను ఏ రకంగా ఇబ్బంది పెట్టారనే విషయాలను జగ్గారరెడ్డి మీడియాకు వివరించారు. రాజకీయాల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఎమ్మెల్యే స్థాయికి వచ్చినట్టుగా జగ్గారెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే ఇంకా గడ్డు పరిస్థితులను కూడా తాను ఎదుర్కొన్నానని జగ్గారెడ్డి గుర్తు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే తన మెంటాలిటీకి సరిపోతుందని ఇటీవల జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో రాజకీయంగా ఝలక్ ఇస్తానని కూడా జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుండి నా ఆట చూపిస్తాననని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇవాళ జగ్గారెడ్డి మంత్రి పదవి విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ కు కోవర్టులుగా పనిచేస్తున్నారని తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి చెప్పారు.ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదని జగ్గారెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వర్గీయులే ఉద్దేశ్యపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయంతో జగ్గారెడ్డి ఉన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది. 40 లక్షల పార్టీ సభ్యత్వం నమోదు చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ఇన్సూరెన్స్ కూడా చేయించారు. తెలంగాణకు చెందిన కీలక కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో బుధవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి సహా 14 మంది నేతలు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులు, రేవంత్ రెడ్డి వ్యవహర శైలిపై పార్టీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. జగ్గారెడ్డి కూడా సోనియా, రాహుల్ ల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.