
హైదరాబాద్: స్ట్రీట్ కాజ్ వీబీఐటీ (విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా కాంగ్రెగేట్ నిర్వహించింది. ఇందులో భాగంగా యువతను సమావేశపరిచి సుస్థిర అభివృద్ధికి మూలమైన అంశాలపై చర్చించారు. ఈ యూత్ అసెంబ్లీకి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సుస్థిర అభివృద్ధికి మూలాధారంగా ఉండే విద్య, మహిళా సాధికారత, పర్యావరణ మార్పులు, సామాజిక మార్పులపై చర్చ చేశారు. ఈ యూత్ అసెంబ్లీ (కాంగ్రెగేట్) కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ప్రతినిధి రాకేశ్ రెడ్డి ప్రారంభించారు.
బీజేపీ ప్రతినిధి రాకేశ్ రెడ్డి తన ప్రసంగంతో ఆ సమావేశంలో ఉత్తేజాన్ని నింపారు. ఆయన యువత, ప్రకృతి గురించి మాట్లాడారు. అదే సందర్భంలో ఆ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధుల్లోనూ హుషారు నింపారు. ఆయన ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి, విద్యార్థులకు అందుతున్న విద్యా నాణ్యతపై మాట్లాడారు. అదే విధంగా భావి తరాలకు అందాల్సిన విద్యా నాణ్యత, ప్రమాణాలు ఎలా ఉండాలనే అంశాలపైనా చర్చించారు.
స్ట్రీట్ కాజ్ వీబీఐటీ నిర్వహించిన ఈ కార్యక్రమం ‘విద్య’ అంశంతోనే ప్రారంభం అయింది. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యది ప్రముఖ పాత్ర. అందుకే దీనితో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు విద్యపై తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రముఖంగా వినిపించింది.
అనంతరం ఇతర సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై తర్వాతి సెషన్‌లూ కొనసాగాయి. విద్య తర్వాత పర్యావరణ మార్పులపై చర్చ జరిగింది. ప్రకృతి, పర్యావరణం కోణంలో అభివృద్ధిపై సమావేశానికి హాజరైన ప్రతినిధులు సంభాషించారు. అదే విధంగా ప్రముఖ ప్రతినిధులు మిగిలిన రెండు సెషన్‌లలో కీలక ప్రసంగాలు చేశారు.
ముఖ్యంగా గ్రామ్య ఫౌండర్, మహిళా కార్యకర్త రుక్మిణీ రావు ఈ సమావేశానికి హాజరై.. మహిళా సాధికారతపై తమ విలువైన ప్రసంగాన్ని ఇచ్చారు. ఆమె లింగ సమానత్వంపై మాట్లాడారు. దీనిపై విస్తృతంగా విద్యార్థులో మాట్లాడారు. అసలు మహిళలకు రిజర్వేషన్లే ఉండాల్సిన అవసరం లేదని, వారిని సమానంగా ట్రీట్ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఇతర ప్రతినిధులు మహిళా సాధికారత, సమాజంపై ప్రభావాలపై చర్చలు చేశారు.