కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతున్నదని, దానికి వైఎస్సార్టీపీ, వామపక్షాల మద్దతు ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ బలహీనపడుతుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయని, మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంఘటితంగా వారి వైపు మలుచుకునే ప్రమాదం పెరుగుతున్నదని గులాబీ దళంలో గుబులు పెరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఉద్యమ పార్టీగా ప్రజల్లోకి వెళ్లిన అప్పటి టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారానికి బలంగా ప్రయత్నాలు చేస్తున్నది. రెండు సార్లు అధికారంలో కొనసాగడంతో మూడో సారి పోటీలో ప్రభుత్వ వ్యతిరేకత ఎదురవడం సహజమే. ఈ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి గులాబీ బాస్ చాన్నాళ్ల కిందే ఓ స్ట్రాటజీని పద్ధతిగా అమలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమై రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్నది. మూడో ప్రయత్నంలోనైనా అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ అంశంతో ఈ రెండు పార్టీలకు సంబంధం ఉన్నది. తెలంగాణ క్రెడిట్‌ను కాపాడుకోవడానికే ఈ రెండు పార్టీలు తొలుత ప్రయత్నాలు చేశాయి. ఇప్పటికీ ఈ క్రెడిట్ గురించి ఉభయ పార్టీలు మాట్లాడటం చూస్తాం. అప్పటి నుంచే కాంగ్రెస్ బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది. బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
undefined
బీఆర్ఎస్‌ను ఢీకొట్టి అధికారాన్ని ఏర్పాటు చేసే స్థితిలో బీజేపీ లేదు. కానీ, కాంగ్రెస్‌కు అది సాధ్యమే. అందుకే చాలా కాలం క్రితం నుంచే బీఆర్ఎస్ చీఫ్ కాంగ్రెస్‌కు చెక్ పెట్టే ప్రయత్నాలు చేశాడని, అందుకోసం బీజేపీ కూడా కొంత పుంజుకునే వాతావరణం ఏర్పాటు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ పుంజుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ కూడా చీల్చడంతో కాంగ్రెస్ బలహీనపడుతుందనే ఆయన స్ట్రాటజీగా ఉందనేది విశ్లేషకుల మాట. కొన్నాళ్ల క్రితం వరకు పరిస్థితులు అలాగే ఉండేవి. కానీ, ఇప్పుడు పరిశీలిస్తే ఈ అంచనాలు తప్పినట్టుగా కనిపిస్తాయి.
Also Read: పవన్ కళ్యాణ్ పై మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
ఇప్పుడు బీజేపీ అనుకున్న స్థాయిలో లేదు. కాంగ్రెస్ కర్ణాటక విజయంతో రెట్టింపు వేగంతో దూకుడు మీదున్నది. దానికి తోడు వామపక్షాలు, వైఎస్సార్టీపి వంటి పార్టీలు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్‌లో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం ప్రతిపాదన నుంచి ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా జరిగి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా వైఎస్ షర్మిలా రెడ్డి మద్దతు ప్రకటించారు. వైఎస్ అభిమానులు, ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మొబిలైజ్ చేయడానికి ఎంతో కొంత ఈ మద్దతు కాంగ్రెస్‌కు కలిసి వస్తుంది. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా ఆంధ్రా సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టే అంశంపై సంశయాలే ఉన్నాయి. సుమారు 25 స్థానాల్లో సెటిలర్ల ఓట్లు పరిగణనలోకి తీసుకోదగిన స్థాయిలో ఉన్నాయి.
సీపీఎం పోటీ చేసే సీట్లు ప్రకటించినా పొత్తు తెగిపోలేదని, ఉభయ పార్టీల జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఒక వేళ వామపక్షాలు కూడా కాంగ్రెస్ వెంటే ఉంటే సెక్యులర్ల ఓటు కూడా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక టీటీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం పరోక్షంగా కాంగ్రెస్‌కే కలిసి వస్తుందని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఘటితమయ్యే ముప్పు ఉన్నది. ఎక్కువ పార్టీలు కాంగ్రెస్ వైపు నిలబడటంతో ఆ ఓట్లను బీజేపీ చీల్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో గులాబీ దళంలో కొంత కలవరం మొదలైనట్టు ప్రచారం మొదలైంది.