నాలుగేళ్లకే పిల్లర్లు కూలాయి .. కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్, విచారణ జరగాల్సిందే : కిషన్ రెడ్డి

By Siva Kodati  |  First Published Nov 3, 2023, 6:11 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . ప్రాజెక్ట్ పేరు మీద రూ.లక్ష కోట్లు దుర్వినియోగం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంగుబాటుతో కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని.. ప్రాజెక్ట్‌పై ఉన్నతస్థాయి విచారణ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజ్ నుంచి నీరు లీక్ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అన్నారు. ప్రాజెక్ట్ పేరు మీద రూ.లక్ష కోట్లు దుర్వినియోగం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కట్టిన నాలుగేళ్లలోనే పిల్లర్లు కూలిపోయాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని తాము ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో కోట్లు ఖర్చు పెట్టారని .. తాను లెటర్ రాసిన తర్వాత ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం తెలంగాణకు పంపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కుంగుబాటుతో కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని.. ప్రాజెక్ట్‌పై ఉన్నతస్థాయి విచారణ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిజైన్, నిర్వహణ లోపాలతో నాలుగేళ్లకే ప్రాజెక్ట్ ప్రశ్నార్ధకంగా మారిందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. 

Latest Videos

ALso Read: Kishan Reddy: 'కల్వకుంట్ల కుటుంబ ఏటీఎం కాళేశ్వరం'

ఇకపోతే.. కాళేశ్వరం ఎత్తిపోతల్లోన మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. భారీ శబ్ధంతో పిల్లర్ల మధ్య వున్న వంతెన కుంగినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా.. ఈ ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో వుందని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో నీటిపారుదల ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా వున్న బ్యారేజ్ కుంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎల్‌ అండ్ టీ సంస్థకు చెందిన నిపుణులు కూడా బ్యారేజ్‌ వద్ద పరిస్థితిని సమీక్షించారు. 

కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 


 

click me!