మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్: షోకాజ్ ఇచ్చే చాన్స్

By narsimha lodeFirst Published Aug 17, 2022, 5:37 PM IST
Highlights


 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఈ  విషయమై శశిధర్  రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది.ఈ విషయమై మర్రి శశిధర్ రెడ్డి కి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

వరంగల్ సభ నిర్వహణకు ముందు న్యూఢిల్లీలో రాహుల్ గాంధీతో నిర్వహించిన సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలపై మీడియా వేదికగా మాట్లాడొద్దని కూడా రాహుల్ గాంధీ సూచించారు. ఏదైనా ఉంటే పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పాలని కోరారు. పార్టీ వేదికలపై చర్చించాలని సూచించారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీకి నష్టం చేస్తే  ఎంతటి పెద్ద నాయకుడైనా చర్యలు తప్పవని కూడా రాహుల్ గాంధీ హెచ్చరించారు.  

also read:రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మాణిక్కం ఠాగూర్.. : మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్టీ నేతలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతుందిని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోల కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియోలను పార్టీ నాయకత్వానికి పంపనున్నారని ఈ కథనం తెలిపింది. 

కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఏజంట్ గా ఆరోపించారు.  ఈ రకమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను మర్రి శశిధర్ రెడ్డిపై షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది.  ఇవాళ హైద్రాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో  మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు  మర్రి శశిధర్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని  మాణికం ఠాగూర్ చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెందిన వెలమ కులాన్ని  ఢీకొట్టే శక్తి రెడ్డి సామాజిక వర్గానికే ఉందని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్నారు. ఒక్క కులంతో ఏమీ కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉందని మాణికం ఠాగూర్ పార్టీ నేతలతో చెప్పారన్నారు. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లి పార్టీకి నష్టం చేసేలా ఉంటే ఆ వ్యాఖ్యల విషయమై పార్టీ వైఖరి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదా అని మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు.  నాలుగు గోడల మధ్య ఈ వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉందని చెబితే లాభం ఏమిటని ఆయన అడిగారు.కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కలత చెందినట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.
 

click me!