తెలంగాణలో అభివృద్ధిని చెడగొట్టే ప్రయత్నం, అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

By narsimha lodeFirst Published Aug 17, 2022, 4:57 PM IST
Highlights

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని కూడ చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు 

మేడ్చల్:దేశాన్ని కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం చేయడం మంచిది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తెచ్చిన స్వాతంత్య్రాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నామన్నారు.  కులం, మతం పేరుతో విద్వేషం పెచ్చరిల్లితే సమాజానికి నష్టమన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం  నిర్వహించిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

సమాజమంతా కలిసికట్టుగా ఉంటే చైనా, సింగపూర్, కొరియా దేశాలలో తరహాలో పురోగమించే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. ఇది జరగాలంటే కుల,మతాలకు అతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వారున్నారన్నారు. అప్పటికప్పుడు ఈ రకమైన మాటలు ఉత్సాహన్ని ఇచ్చినా ఆ తర్వాత దుష్పలితాలను కల్గిస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో జరిగేది  ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదో ప్రతి ఒక్కరూ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్దిని చూసి దేశమంతా నివ్వెరపోతుందన్నారు.  దేశంలో జరిగే పరిణామాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

 మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ కూడా కలలో కూడా అనుకోలేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టుగా కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల కొత్త పెన్షన్లను ఈ నెల 15 వ తేదీ నుండి అమలు చేస్తున్నామన్నారు. పాత, కొత్త పెన్షన్ కార్డులను లబ్దిదారులకు అందించాలని సీఎం ప్రజా ప్రతినిధులను కోరారు. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అభివృద్ది సాధ్యమన్నారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విద్యుత్ కోతలుండేవన్నారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ  ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామిక వేత్తలు ఆందోళనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కానీ దేశంలో 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని కేసీఆర్ గుర్తు చేశారు. దేశ రాజధానిలో విద్యుత్ కోతలున్నాయన్నారు. కానీ తెలంగాణలో మాత్రం విద్యుత్ కోతలు లేవన్నారు. అంకిత భావంతో పనిచేస్తేనే ఇది సాధ్యమన్నారు.  దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాడు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ. 1 లక్ష ఉంటే ఇప్పుడు రూ. 2.76 లక్షలకు దాటిందని కేసీఆర్ చెప్పారు. 2014లో  తెలంగాణ జీఎస్ డీపీ రూ. 5 లక్షల కోట్లుంటే ఇవాళరూ.11 లక్షల 50 వేలకు చేరిందని ఆయన గుర్తు చేశారు. 

ఇవాళ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉంటే ప్రజలకు  సంక్షేమ పథకాలు అందేవా అని ఆయన ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో ఇచ్చిన రూ 5 కోట్లకు అదనంగా మరో రూ. 7 కోట్లు అదనంగా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
 

click me!