Munugode ByPoll 2022 : కోదండరామ్‌తో కాంగ్రెస్ నేతల భేటీ .. మద్ధతుపై వినతి, ‘‘సార్’’ నిర్ణయమేంటో..?

By Siva KodatiFirst Published Aug 16, 2022, 8:37 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ సూచనతో కోదండరామ్‌ని కలిశామని హస్తం నేతలు మహేశ్ గౌడ్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డిలు తెలిపారు. 

మునుగోడు ఉపఎన్నికకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్‌తో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో నేతలను ఆకర్షిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుండటంతో .. కాంగ్రెస్ తన సొంతబలం, క్యాడర్‌తోనే సత్తా చాటాలని భావిస్తోంది. ఇదే సమయంలో కమ్యూనిస్టులు, ప్రొఫెసర్ కోదండరామ్‌ మద్ధతు కూడగట్టాలని హస్తం నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డిలు కోదండరామ్‌తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. 

భేటీ ముగిసిన అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ సూచనతో కోదండరామ్‌ని కలిశామన్నారు. మునుగోడు ఉపఎన్నికపై మద్ధతు ఇవ్వాలని కోరామని.. అయితే కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని మహేశ్ గౌడ్ వెల్లడించారు. టీఆర్ఎస్, బీజేపీ వ్యవహారశైలిపై చర్చ జరిగిందని.. కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకునిపోతామని ఆయన తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఎన్నికలు జరుగుతున్నాయని మహేశ్ గౌడ్ ఆరోపించారు. 

ALso Read:Munugode bypoll 2022: మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదం,నియోజకవర్గంలో రేవంత్ మకాం

మరోవైపు.. మునుగోడు ఉపఎన్నికల్లో ‘‘మన మునుగోడు- మన కాంగ్రెస్’’ నినాదంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. విజయమే లక్ష్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నియోజకవర్గంలో మకాం వేశారు. ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. ఈ ఏడు మండలాలకు ఇద్దరేసి కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది. తమకు కేటాయించిన మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు  చేరుకున్నారు. 

మరోవైపు ఈ నియోజకవర్గంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 15 రోజులు మకాం వేయనున్నారు. మునుగోడులో తన పట్టును నిలుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. క్యాడర్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు వెళ్లకుండా ప్రయత్నాలు మొదలెట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరించింది. పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ లో చేర్చుకొనే ప్రయత్నాలను తీవ్రం చేసింది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి క్యాడర్ చెదిరిపోవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 9 మాసాల పాటు ఓపిక పడితే  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

click me!