కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ఇవాళ సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు.
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు బస్సు యాత్ర, కొల్లాపూర్ లో ప్రియాంక సభపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు బుధవారంనాడు సమావేశమయ్యారు. పార్టీకి చెందిన పీఏసీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లంచ్ భేటీకి ఆహ్వానించారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీలో చేరికలు , బస్సు యాత్ర వంటి అంశాలపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కర్ణాటక ఫార్మూలాను అవలంభించాలని ఆ పార్టీ భావిస్తుంది. అదే తరహాలో ఐదు అంశాలపై ప్రజలకు హామీలు ఇచ్చే విషయమై కూడ పార్టీ నేతలు చర్చించే అవకాశం లేకపోలేదు.
undefined
మరో వైపు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరికలపై కూడ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమయ్యారు. మరికొందరు నేతల చేరికపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త నేతల చేరికతో ఇప్పటివరకు పార్టీలో ఉన్న నేతలకు ఇబ్బంది పడొద్దనే కొందరు నేతలు వాదిస్తున్నారు.ఈ విషయమై కూడ ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం రానుంది.
also read:సీనియర్లంతా బస్సు యాత్ర నిర్వహించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రానున్న మూడు మాసాల పాటు ప్రజల్లో ఉండేలా ఏం చేయాలనే దానిపై కూడ చర్చిస్తున్నారు. బస్సు యాత్ర చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచిస్తున్నారు. బస్సు యాత్రలో సీనియర్లంతా నియోజకవర్గాల్లో టూర్ చేయడం వల్ల క్యాడర్ తో పాటు ప్రజలకు కాంగ్రెస్ ఐక్యంగా ఉందనే సంకేతం ఇవ్వవచ్చంటున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బస్సు యాత్ర గురించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు.
కొల్లాపూర్ సభపై చర్చ
ఈ నెల 20వ తేదీన జరగాల్సిన కొల్లాపూర్ సభ వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులతో పాటు ప్రియాంక షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఈ సభ వాయిదా పడింది. అయితే ఈ సభను ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచిస్తున్నారు. కొల్లాపూర్ సభలోనే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు.