టికెట్‌ ఇప్పిస్తానని రూ.1.40 కోట్లు వసూలు: కోర్టుకు హాజరైన రేణుకా చౌదరి

By Siva KodatiFirst Published Sep 23, 2019, 3:05 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి సోమవారం ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామంటూ తమ వద్ద నుంచి రేణుకా రూ.1.40 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ డా.రాంజీనాయక్ భార్య భూక్య చంద్రకళ ఖమ్మం కోర్టులో పిటిషన్ వేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి సోమవారం ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామంటూ తమ వద్ద నుంచి రేణుకా రూ.1.40 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ డా.రాంజీనాయక్ భార్య భూక్య చంద్రకళ ఖమ్మం కోర్టులో పిటిషన్ వేశారు.

రేణుకా వల్లే తన భర్త చనిపోయాడంటూ ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణకు హాజరుకావాల్సిందిగా గతంలోనే న్యాయస్థానం రేణుకా చౌదరికి నోటీసులు పంపింది.

అయితే ఆమె వాటికి స్పందించకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి సోమవారం రేణుకా చౌదరి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

రేణుకా చౌదరి తమను మోసం చేశారంటూ చంద్రకళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌‌లో ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. రేణుకను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేదంటే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని చంద్రకళ అప్పట్లో హెచ్చరించారు.

వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకుంటున్న తన భర్త రామ్‌జీకి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఇప్పిస్తానని రేణుక తొలుత రూ.1.2 కోట్లు తీసుకున్నారని.. ఆ తర్వాత అభివృద్ధి పనులు, సమావేశాల పేరుతో మరో కోటి రూపాయల వరకు తమతో ఖర్చు పెట్టించారని చంద్రకళ ఆరోపించారు.

చివరికి తన భర్తకు టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపారని, ఆమె అనుచరులు పుల్లయ్య, రామారావు, రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్‌రెడ్డిలు తమను కులం పేరుతో దూషించడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అవమానాలు భరించలేక తన భర్త రామ్‌జీ 2014 అక్టోబర్ 10న మరణించారని చంద్రకళ తెలిపారు. 

రేణుకా చౌదరికి షాక్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

రేణుకా చౌదరికి ఐటీ షాక్

click me!