ఖమ్మం సభ విషయమై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మాణిక్ రావు ఠాక్రే ఇవాళ భేటీ అయ్యారు.
ఖమ్మం:సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, ఎఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరిలు బుధవారంనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడం వద్ద సమావేశమయ్యారు. ఈ ఏడాది జూలై 2వ తేదీన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభపై మాణిక్ రావు ఠాక్రే చర్చించనున్నారు.
జూలై రెండో తేదీన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగియనుంది. ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఖమ్మంలో సభను నిర్వహించనున్నారు. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మాణిక్ రావు ఠాక్రే సమావేశానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం ఆహ్వానం పంపింది.
also read:ఖమ్మంలో కాంగ్రెస్ సభ: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ కానున్న ఠాక్రే
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగిసింది. మధ్యాహ్నం కాంగ్రెస్ పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భోజన విరామం తీసుకున్నారు. అదే సమయంలో మాణిక్ రావు ఠాక్రే , రోహిత్ చౌదరి నాయకన్ గూడెం వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో చర్చిస్తున్నారు.
మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని నిర్వహించే సభ విషయమై నిన్న కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో కొందరు నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాల మేరకు మాణిక్ రావు ఠాక్రే ను మల్లు భట్టి విక్రమార్కతో చర్చించాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. దీంతో మాణిక్ రావు ఠాక్రే భట్టి విక్రమార్కతో సమావేశానికి నాయకన్ గూడెం వచ్చారు.ఖమ్మం సభను విజయవంతం చేసే విషయమై పార్టీ నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఖమ్మం సభ ఎన్నికల శంఖారావానికి శంఖం పూరించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేయనుందో వివరించనుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయమై పార్టీ అగ్రనేతలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కొంత కాలంగా కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.