తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 8 నుంచి హోరాహోరీ.. 600 మంది నేతలు రంగంలోకి

Published : Jun 28, 2023, 03:42 PM IST
తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 8 నుంచి హోరాహోరీ.. 600 మంది నేతలు రంగంలోకి

సారాంశం

తెలంగాణ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని సాధించాలని ఉవ్విళ్లూరింది. కానీ, కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకోవడం, అలాగే, పార్టీలో వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరడం కారణంగా రాజకీయ పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఢీకొట్టేది కాంగ్రెస్సే అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.  

హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు బీజేపీనే గట్టి పోటీ ఇవ్వగలదన్నట్టుగా కనిపించింది. ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉండేది. కాంగ్రెస్ పని దాదాపుగా ముగిసిపోయిందనే అనుకున్నారు. కానీ, కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు దక్షిణాదిలో ఓ కుదుపు తీసుకువచ్చింది. ఈ ఫలితాలు ఇతర రాష్ట్రాల ఎన్నికలపైనా ప్రభావం వేస్తున్నది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపు తీసుకువచ్చింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీలో కొన్ని అంతర్గత సమస్యలతో బలహీనపడింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో మళ్లీ బీజేపీని మెరుగైన స్థానానికి తీసుకురావాలని, బీఆర్ఎస్‌ను ఢీకొట్టే పార్టీ బీజేపీనే అని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉన్నది. దక్షిణాదిలో తెలంగాణ ద్వారా పట్టు బిగించుకోవాలని బీజేపీ అదిష్టానం భావిస్తున్నది. అందుకే బలహీనమైన తెలంగాణ బీజేపీకి హైకమాండ్ పలు సూచనలు, సలహాలు చేసింది. అంతేకాదు, ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తమైంది. రాష్ట్ర బీజేపీలో ఉత్సాహాన్ని తీసుకురావడంతోపాటు ప్రజల్లోనూ మళ్లీ తమపై నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలని ప్లాన్ చేస్తున్నది.

ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 8వ తేదీన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత కార్యదర్శులతో బీజేపీ హైదరాబాద్ వేదికగా కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నది. నిజానికి ఈ సమావేశం చెన్నైలో నిర్వహించాల్సింది. కానీ, తెలంగాణలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమావేశ వేదికను హైదరాబాద్‌కు తరలించారు. 

అలాగే.. పలు రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులను ఈ రాష్ట్రానికి తీసుకువస్తున్నది. వీరి సహాయంతో తెలంగాణ బీజేపీని బలోపేతం చేయనుంది. పలు కార్యక్రమాలనూ చేపట్టనుంది. వీరు బృందాలుగా విడిపోయి బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బూత్ స్థాయిలో పార్టీని వీరు బలోపేతం చేస్తారు. 8వ తేదీ తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రచారం ఉధృతంగా సాగనుంది.

Also Read: రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల భయం: జగన్ మీదైతే సరే...

తెలంగాణలో మళ్లీ బీజేపీ పుంజుకోవాలంటే.. కేంద్ర నాయకులు సహా అనుభవమున్న కార్యకర్తలూ అవసరం అని ఆ పార్టీ భావించి ఉండొచ్చని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే పై నిర్ణయాలు తీసుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ సమావేశం తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభనూ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఆహ్వానించాలనీ ప్లాన్ వేస్తున్నారు. తెలంగాణలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ గర్జన సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. అలాగే, మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా బీజేపీ గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

ఇటీవలే నాగర్ కర్నూల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలో మట్లాడిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎలాంటి పొత్తు లేదని, డైరెక్ట్ ఫైటే అని ఇక్కడి నేతలకు విస్పష్టీకరించిన విషయం విదితమే.

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?