బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని తేలిందని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అవమానాన్ని దిగమింగుకొని గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించారన్నారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ఇలా మాట్లాడుతుందని అనుకోలేదని తెలంగాణ కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు సాయంత్రం కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పెద్దల గైడ్ లైన్స్ మేరకు అసెంబ్లీలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగం సాగిందన్నారు. గవర్నర్ తన అవమానాన్ని దిగమింగుకొని మాట్లాడారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని తాము చేస్తున్న విమర్శలు నిజమయ్యాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. తెలంగాణ సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదంపై విచారణ జరిపించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
also read:పెద్ద పెద్ద మాటలు చెప్పి తుస్సుమనిపించారు: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి సంచలనం
ప్రగతి భవన్, రాజ్ భవన్ కి మధ్య సయోధ్య కుదిరింది. గత నెల 30వ తేదీన ఈ సయోధ్య ప్రయత్నం జరిగింది. బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపలేదని గత నెల 30వ తేదీన తెలంగాణ సర్కార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు సూచనతో ఇరువర్గాల న్యాయవాదులు చర్చించుకున్నారు. గవర్నర్ పై విమర్శలు చేయవద్దని గవర్నర్ తరపు న్యాయవాది కోరారు.
రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ఇవరువర్గాల మధ్య సయోధ్య కుదిరిన విషయాన్ని హైకోర్టుకు చెప్పారు.లంచ్ మోషన్ పిటిషన్ ను కూడా కేసీఆర్ సర్కార్ వెనక్కి తీసుకుంది. అదే రోజ రాత్రి తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఆహ్వానించారు.