
కొల్లాపూర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీకి ఆసక్తిచూపే అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించింది. వారిలో మెరుగైన అభ్యర్థులను ఎంపికచేసి ప్రకటించేందుకు కూడా కసరత్తు ప్రారంభించింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నేత షాకిచ్చాడు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరికను వ్యతిరేకిస్తూ వచ్చిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్ప తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరారు.
ఆర్థిక మంత్రి హరీష్ రావు సమక్షంలో అభిలాష్ రావు అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఇప్పటికే కొల్లాపూర్ బిఆర్ఎస్ టికెట్ మళ్లీ హర్షవర్దన్ కే దక్కిన నేపథ్యంలో ఆయన గెలుపుకోసం కృషిచేస్తానని అభిలాష్ రావు తెలిపారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను ఎంతగానో కష్టపడ్డానని అభిలాష్ రావు అన్నారు. కానీ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు జూపల్లి కృష్ణారావు ఎన్నికల సమయంలో పార్టీలో చేరి తానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయననే బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోందని... అలాంటి వ్యక్తి చేతుల్లోకి కొల్లాపూర్ వెళ్లొద్దనే బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు అభిలాష్ రావు తెలిపారు.
Read More అంతా కాలమే నిర్ణయిస్తుంది.. పార్టీ మారడంపై ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు..
కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రజల మద్దతు వుందని అభిలాష్ రావు అన్నారు. ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని అభిలాష్ రావు తెలిపారు.