తెలంగాణ‌పై స్పష్టమైన విజన్ లేని పార్టీ.. : కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Oct 16, 2023, 4:23 PM IST

Telangana Assembly Elections 2023: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్ర‌భుత్వం తెలంగాణ‌లో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విజ‌యంతో కేసీఆర్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి స‌రికొత్త చరిత్ర‌ను సృష్టిస్తార‌ని ధీమా వ్య‌క్తంచేశారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి తెలంగాణపై విజ‌న్ లేద‌ని అన్నారు. 
 


BRS working president and Minister KTR: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ త‌మ‌ ఆరు హామీలను కాపీ కొట్టిందని కాంగ్రెస్ ఆరోపించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలకు పేర్లు మార్చింద‌ని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో 2023 ఎన్నికల కోసం బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొన్ని కొత్త పథకాలపై కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే పథకం 'కేసీఆర్ బీమా, రేషన్ కార్డులున్న కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించే 'తెలంగాణ అన్నపూర్ణ' పథ‌కాల‌ను కొనియాడారు. రాష్ట్రంలోని మహిళలను ఆదుకునేందుకు ఉద్దేశించిన 'సౌభాగ్య లక్ష్మి' పథకం మ‌హిళ‌ల సాధికార‌త‌కు మ‌ద్దతు ఇస్తుంద‌ని తెలిపారు.

తెలంగాణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలో భాగంగానే ఈ పథకాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు నిస్సహాయ పౌరులను ఆదుకోవడానికి ఉప‌యుక్తంగా ఉంటాయ‌ని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఉచిత విద్యుత్, చౌక బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. సాంఘిక సంక్షేమం పట్ల బీఆర్ ఎస్ నిబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కంటే బీఆర్ఎస్ పాలనలో 44 లక్షల మంది ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించిన బీఆర్ఎస్ పాలనా విధానంపై విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.

Latest Videos

రాష్ట్రంపై స్పష్టమైన విజన్ కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. గతంలో వైఫల్యాలు ఎదురైనా కాంగ్రెస్ ఎందుకు ఎక్కువ అవకాశాలు అడుగుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన బీఆర్ఎస్ కు లేదనీ, రాజకీయ పొత్తుల కంటే ముందే రాష్ట్ర అభివృద్ధి జరగాలని విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ లో ఇతర రాష్ట్రాలను మించి తెలంగాణకు కేటాయించామన్నారు. 2014 నుంచి మైనార్టీ సంక్షేమంలో బీఆర్ ఎస్ తన పెట్టుబడులను పది రెట్లు పెంచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని నడిపిస్తారనీ, తాము అధికారంలోకి వచ్చాక జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.

click me!