మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారంనాడు పొన్నా ల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. ఈ నెల 13న పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ నెల 14న పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ లో చేరాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ నెల 15న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. ఇవాళ జనగామలో బీఆర్ఎస్ సభలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నట్టుగా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అయిన మూడు మాసాల్లోనే సీఎం కేసీఆర్ కులగణన చేశారన్నారు. కానీ ఎన్నికలు వచ్చాయని కులగణనను కొన్ని పార్టీలు ముందుకు తీసుకు వచ్చాయని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లను నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. చేస్తున్న అభివృద్ధి, అణగారిన వర్గాల కోసం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. ఈ కారణాలతో మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ తోడ్పాటు అందిస్తుందన్నారు.
జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో దిగాలని పొన్నాల లక్ష్మయ్య భావించారు. కానీ ఈ దఫా తనకు టిక్కెట్టు దక్కదని పొన్నాల లక్ష్మయ్య అనుమానించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు.
also read:కేటీఆర్ ఆహ్వానం: కేసీఆర్‌తో పొన్నాల లక్ష్మయ్య భేటీ
టిక్కెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంతలో గొడ్లను అమ్ముకున్నట్టుగా అమ్ముకుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు.పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై అధినాయకత్వాన్ని చెప్పేందుకు వెళ్తే పట్టించుకొనే వారే లేరని రాజీనామా లేఖలో పొన్నాల లక్ష్మయ్య ఆరోపించిన విషయం తెలిసిందే.