మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. మైండ్ గేమ్ లతో రాజకీయ లబ్దిపొందే ప్రయత్నం చేశారని పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
ఖమ్మం: తన చేతిలో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు.సోమవారంనాడు ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను ఖమ్మంలో లేని సమయంలో బందిపోట్ల మాదిరిగా పర్యటించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. తాను ఖమ్మంలో ఉన్న సమయంలో ఖమ్మానికి రావాలని ఆయన కోరారు.ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారని మైండ్ గేమ్ ఆడారని తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై ఆయన విమర్శలు చేశారు. గత ఎన్నికల సమయంలో కూడ ఇదే రకంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో పాలేరు నుండి పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే ఆనాడు పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయకుండా అప్పట్లో టీడీపీలో ఉన్న నామా నాగేశ్వరరావు వర్గం అడ్డుపడింది. దీంతో 2014 ఎన్నికల సమయంలో ఖమ్మం నుండే తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
undefined
ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. ఆ తర్వాత తన మంత్రి వర్గంలోకి తుమ్మల నాగేశ్వరరావును తీసుకున్నారు. 2014లో పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మరోసారి పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
also read:బాలసాని ఇంటికి తుమ్మల, పొంగులేటి: కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానం
కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే పాలేరు అసెంబ్లీ సీటు తుమ్మల నాగేశ్వరరావుకు దక్కలేదు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు గత మాసంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.