రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు: ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

By telugu teamFirst Published Sep 25, 2021, 9:30 AM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెసు అధిష్టానం సీరియస్ అయింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆరా తీశారు.

హైదరాబాద్:  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు అధిష్టానం సీరియస్ అయింది. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆరా తీశారు. 

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఈ రోజు శనివారం సాయంత్రం జరిగే రాజకీయ వ్యవహారల కమిటీ సమావేశంలో చర్చించాలని ఆయన సూచించారు. మాణికం ఠాగూర్ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాదు వస్తున్నారు. ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు నుంచి ఆయన వివరాలు తెప్పించుకున్నారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు మాణికం ఠాగూర్ కు చేరాయి.

పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడకూడదని, పార్టీ సమావేశాల్లో చర్చించాలని మాణికం ఠాగూర్ గతంలో సూచించారు. అయితే, ఆ సూచనను బేఖాతరు చేస్తూ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై పార్టీ సీనియర్ల సమావేశంలో ధ్వజమెత్తారు.

Also Read: కాంగ్రెస్ పార్టీనా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా?: రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

ఇది కాంగ్రెసు పార్టీయా, ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీయా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండా రేవంత్ రెడ్డి రెండు నెలల  కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. జహీరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. 

సంగారెడ్డి వచ్చిన రేవంత్ రెడ్డి తనకు సమాచారం ఇవ్వకపోవడమేంిటని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా అని ఆయన అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా తనతో విభేదాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చాటి చెప్పాలని అనుకుంటున్నారా అని అడిగారు. 

గత శనివారంనాడు జూమ్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. రెండు నెలల కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి కొందరు సీనియర్లు హాజరు కాలేదు. అయితే, సీనియర్లకు చెప్పకుండా కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి అడిగారు. జగ్గారెడ్డి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉ్నారు. 

జగ్గారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డితో కాంగ్రెసు సీనియర్లకు పొసగడం లేదని, రేవంత్ రెడ్డి తీరును సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. కొంత మంది సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అందుకే, రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ మీద సీనియర్ కాంగ్రెసు నేతలు నోరు విప్పలేదని చెబుతున్నారు. 

రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే మాట్లాడుతున్నారని ప్రచారం సాగుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా ఆయనకు మద్దతుగా సీనియర్లు ముందుకు రాలేదని చెబుతున్నారు.

click me!