పాలాభిషేకం చేస్తానన్న కోమటిరెడ్డి.. నిరుద్యోగులు జాగ్రత్త అన్న బండి సంజయ్ : రేపటి కేసీఆర్ ప్రకటనపై విపక్షాలు

Siva Kodati |  
Published : Mar 08, 2022, 09:43 PM ISTUpdated : Mar 08, 2022, 09:46 PM IST
పాలాభిషేకం చేస్తానన్న కోమటిరెడ్డి.. నిరుద్యోగులు జాగ్రత్త అన్న బండి సంజయ్ : రేపటి కేసీఆర్ ప్రకటనపై విపక్షాలు

సారాంశం

తెలంగాణ అసెంబ్లీలో రేపు కీలక ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు స్పందించారు.   

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు.. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మూడేళ్లుగా పెండింగ్‌లో వున్న నిరుద్యోగ భృతిపై ప్రకటనలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) . ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తోందని ఆయన గుర్తుచేశారు. వనపర్తి సభలోనే సీఎం ఉద్యోగాల నోటిఫికేషన్లపై ప్రకటన చేస్తారని అనుకున్నానని విక్రమార్క అన్నారు. ఉద్యోగాల భర్తీ  ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

అటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) సైతం స్పందించారు. కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై ప్రకటన వస్తుందని భావిస్తున్నానని కోమటిరెడ్డి తెలిపారు. మేము ఆశించినట్లుగా సీఎం ప్రకటన వుంటే కేసీఆర్‌ ఫోటోకు పాలాభిషేకం చేస్తానని వెంకట్ రెడ్డి అన్నారు. 

మరోవైపు తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) కూడా స్పందించారు. నిరుద్యోగులారా తస్మాత్ జాగ్రత్త అన్న ఆయన.. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నారని ఆరోపించారు. లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చే దాకా వదిలిపెట్టమని బండి సంజయ్ హెచ్చరించారు. బకాయిలతో సహా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 10 వేలో, 20 వేలో ప్రకటించి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 

అంతకుముందు వనపర్తి జిల్లా (wanaparthy district) నాగవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ రేపు అసెంబ్లీలో (telangana assembly budget session ) కీలక ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరుకుంటున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. వనపర్తి జిల్లా కేంద్రం అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదన్నారు. ఇప్పుడు వనపర్తి జిల్లా  అభివృద్దిలో దూసుకుపోతోందని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్ధితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్ జిల్లాలో (mahabubnagar district) ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందన్న కేసీఆర్.. పాలమూరు జిల్లా పాలుగారుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ధాన్యపురాశులతో కళకళలాడుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలంతా తిరిగి తెలంగాణకు వచ్చారని.. అలాగే తెలంగాణకు పనుల కోసం 11 రాష్ట్రాల నుంచి వస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. 

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని (palamuru lift irrigation project) పూర్తి చేస్తామన్న ఆయన.. తాను సంతోషం పట్టలేక పొలాల్లోకి వెళ్లి చూశానని గుర్తుచేశారు. అద్భుతమైన వజ్రపు తునక నా పాలమూరు జిల్లా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు అభివృద్ధి కోసం నిరంజన్ రెడ్డి ఎంతో కష్టపడి పనిచేశారని సీఎం ప్రశంసించారు. నిరంజన్ రెడ్డి (niranjan reddy) ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ఎలా అభివృద్ది చెందిందో భారతదేశం అంతా అలాగే అభివృద్ధి చెందాలని సీఎం కోరుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu