తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివరాలు.. మంత్రి మల్లారెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజ సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపట్టారు. అయితే గబ్బిలాల పేట ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా మంత్రి మల్లారెడ్డిని కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్ నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో 58, 59 జీవో అమలు, 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదికాస్తా తోపులాటకు దారితీసింది. దీంతో గబ్బిలాల పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే జవహర్ నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలకు మంత్రి మల్లారెడ్డి పరిష్కారం చూపాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఇక, ఆ ప్రాంతంలో పాదయాత్ర కొనసాగించిన మంత్రి మల్లారెడ్డి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.