శుభవార్త..  ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం ఆదేశం..  

By Rajesh KarampooriFirst Published Mar 2, 2024, 10:53 PM IST
Highlights

Indiramma housing scheme:  పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మరో పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మార్చి 11న ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు

Indiramma housing scheme: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మరో పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మార్చి 11న ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. సొంత ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ గృహనిర్మాణ పథకం లబ్ధిని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మొదట ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణం కోసం నిధులను ఏ దశలో, ఎన్ని విడతలుగా విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  
 
ఈ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయాలని తాత్కాలిక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం, రూ. 5 లక్షల లబ్ధి చేకూరుతుంది. దశలవారీగా నిధుల విడుదలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా పక్కా మార్గదర్శకాలు రూపొందించాలని రేవంత్ అన్నారు.

సొంత ప్లాట్‌లో ఇల్లు నిర్మించుకునే వారికి వివిధ రకాల ఇళ్ల నమూనాలు, డిజైన్లు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. గృహనిర్మాణ పథకం కింద ఇంటి నిర్మాణంలో వంటగది, మరుగుదొడ్డి ఉండేలా నిర్మించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్న వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్‌ విభాగాలకు ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని రేవంత్‌ అధికారులకు సూచించారు.గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల్లో చేసిన తప్పులు జరగకుండా .. అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని తెలిపారు. సమీక్షంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

click me!