కేసీఆర్ పేరును తొలగించి తన పేరు ... అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

By Arun Kumar P  |  First Published Dec 20, 2023, 9:55 AM IST

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును తొలగించి తన పేరుతో డిల్లీలోని అధికారిక నివాసానికి నేమ్ ప్లేట్ ఏర్పాటుచేయగా... అందులో ఉర్దూ లేకపోవడంతో రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 


న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం దేశ రాజధాని డిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసాన్ని సందర్శించారు. అయితే ఈ నివాస భవనానికి తన పేరుతో ఏర్పాటుచేసిన నేమ్ ప్లేట్ చూసి రేవంత్ ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అందులో తన పేరు, హోదా తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మాత్రమే వుండటం సీఎం కోపానికి కారణంగా తెలుస్తోంది.  తెలంగాణ రాష్ట్రానికి రెండో అధికారిక బాషగా వున్న ఉర్దూ నేమ్ ప్లేట్ లో లేకపోవడంతో రేవంత్ ఆగ్రహించినట్లు సమాచారం.  

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ లోని ప్రజా భవన్ (ప్రగతి భవన్) డిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని కూడా కేసీఆర్ ఖాళీచేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజా భవన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన ప్రభుత్వం డిల్లీలోని నివాసాన్ని మాత్రం ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా కొనసాగిస్తోంది. ఈ మేరకు తుగ్లక్ రోడ్డులోని భవనానికి కొన్ని మరమ్మతులు చేసి రేవంత్ రెడ్డి కోసం సిద్దంచేసారు. 

Latest Videos

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి డిల్లీకి వెళ్లిన రేవంత్ అధికారికి నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగానే ఆ ఇంటికి ఏర్పాటుచేసిన నేమ్ ప్లేట్ ను చూసి ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్దూను కూడా ఈ నేమ్ ప్లేట్ లో చేర్చాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో నేమ్ ప్లేట్ మార్చేందుకు తెలంగాణ భవన్ అధికారులు సిద్దమయ్యారు. 

Also Read  టిడిపియే కాదు వైసిపి ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ విందు...

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీగా, కేంద్ర మంత్రిగానే కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కేసీఆర్ డిల్లీ తుగ్లక్ రోడ్డులోని భవనాన్నే అధికారిక నివాసంగా కొనసాగించారు. 2004 లో ఈ నివాసానికి మారిన కేసీఆర్ ఇటీవల అధికారం కోల్పోయేవరకు కొనసాగారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా ఎప్పుడు డిల్లీ వెళ్లినా ఇదే భవనంలో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు బస చేసేవారు. ఇప్పుడు ఆ భవనం రేవంత్ అధికారిక నివాసంగా మారింది. 

ఇదిలావుంటే దేశ రాజధాని డిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో చర్చించారు. తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణం, అందులోని భవనాలు , వాటి స్థితిగతులు, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటాపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 

తెలంగాణ భవన్ మొత్తం 19.78 ఎకరాల్లో విస్తరించి వుందని... ఇందులో 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రహదారులు, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టళ్లు, పటౌడీ హౌస్ వున్నట్లు అధికారులు రేవంత్ రెడ్డికి వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాలు.. ఏపీకి 11.536 ఎకరాలు వస్తుందని ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే దాదాపు 40 ఏళ్లు కావొస్తుండటంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త భవనం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తులపై ముందు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. 

click me!