ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?

Published : Sep 15, 2026, 07:21 PM IST
Revanth Reddy

సారాంశం

తెలంగాాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ తో భేటీ అయ్యారు. తాజ్ పలక్ నుమాలో ఇవాళ జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చించారు… వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణలో పెట్టుబడులు, పర్యాటకం, విద్య, వైద్యం, వారసత్వ కట్టడాల పరిరక్షణ వంటి అంశాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, వారసత్వ భవనాల సంరక్షణ, విద్యా–పర్యాటక రంగాల్లో సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, అగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత ఆగా ఖాన్-IV మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు సానుభూతి తెలిపారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని సీఎం వివరించారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనేలా సదస్సును నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

తెలంగాణలో వ్యాపార, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V భాగస్వామ్యం రాష్ట్రానికి మరింత అంతర్జాతీయ గుర్తింపును తీసుకురాగలదని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం

హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆగా ఖాన్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణలో ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో పలు వారసత్వ కట్టడాల పునరుద్ధరణ చేపట్టిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. శాసనమండలి భవన పునరుద్ధరణతో పాటు కుతుబ్ షాహీ టూంబ్స్ అభివృద్ధిలో ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని గుర్తు చేశారు. కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణ తర్వాత జరిగిన కార్యక్రమంలో తాము కలిసి పాల్గొన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

మూసీ పునరుజ్జీవనంలో సహకారం కోరిన సీఎం

హైదరాబాద్ భవిష్యత్తు అభివృద్ధిలో మూసీ నది పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసా, మూసా నదుల సంగమంతో ఏర్పడిన మూసీ కాలక్రమంలో ఆక్రమణలు, కాలుష్యంతో ప్రభావితమైందని వివరించారు.

మూసీని పునరుజ్జీవింపజేసి దాని చుట్టూ నగరాభివృద్ధిని విస్తరించడంతో పాటు నైట్ ఎకానమీని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నది పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలను కూడా ఈ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి వారసత్వ ప్రాధాన్యం ఉన్న భవనాల పునరుద్ధరణకు అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం అందించాలని సీఎం కోరారు.

ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి కొత్త రూపం?

ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో కొత్త భవనం నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కొత్త ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక భవనాన్ని వారసత్వ సంపదగా పరిరక్షించే అంశంపై దృష్టి పెట్టాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను కోరారు.

చారిత్రక నిర్మాణ విలువను కాపాడుతూ ఆ భవనాన్ని అభివృద్ధి చేయడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అనుభవం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే తరహాలో సిటీ కాలేజ్ భవనం పునరుద్ధరణపైనా ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కోరినట్లు సమావేశంలో వెల్లడైంది.

ఫ్యూచర్ సిటీపై రహీమ్ ఆగా ఖాన్ ఆసక్తి

సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ కూడా చర్చకు వచ్చింది. సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన సంస్థ రూపొందిస్తోందని చెప్పారు.

ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం వివరించారు. ఇందులో దాదాపు 15 వేల ఎకరాల మేర గ్రీన్ జోన్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరిచినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భారీ స్థాయిలో విస్తరించడమే తమ ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 2.5 శాతం ఉందని, భవిష్యత్తులో దాన్ని 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమలు, టెక్నాలజీ, విద్య, వైద్యం, పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

విద్యా రంగంలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ప్రతిపాదన

సమావేశంలో విద్యా రంగంలో సహకారంపైనా చర్చ జరిగింది. ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో ప్రపంచస్థాయి విద్యాసంస్థలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వివరాలను సీఎం సలహాదారు రామకృష్ణారావు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు వివరించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహా పలు అంతర్జాతీయ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరారు. దీనివల్ల హైదరాబాద్ అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

పర్యాటక రంగంలోనూ భాగస్వామ్యానికి ప్రతిపాదన

హైదరాబాద్‌కు ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రపంచ స్థాయిలో మరింతగా ప్రదర్శించేందుకు పర్యాటక రంగంలో కూడా సహకారం అవసరం అని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆగా ఖాన్ ఫౌండేషన్ ఇప్పటికే వారసత్వ కట్టడాల పరిరక్షణలో అందిస్తున్న సేవలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ ప్రస్తావించారు.

భవిష్యత్తులో తెలంగాణలో వారసత్వ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహకారం అందించాలని ఆమె కోరారు. హైదరాబాద్ చారిత్రక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో ఇటువంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అభివృద్ధి, వారసత్వ పరిరక్షణకు సమన్వయం

మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V మధ్య జరిగిన సమావేశంలో తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఒకవైపు ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమ్మిట్ వంటి ఆధునిక అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెడుతూనే.. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం, మూసీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడం వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.

డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను ఆహ్వానించడం, విద్య, పర్యాటకం, వైద్యం, వారసత్వ పరిరక్షణ రంగాల్లో సహకారాన్ని కోరడం ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. భవిష్యత్తులో ఆగా ఖాన్ ఫౌండేషన్‌తో తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తృతంగా కలిసి పనిచేసే అవకాశాలకు ఈ భేటీ బాటలు వేయనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం