ఓయూకి మళ్లీ వస్తా.. పోలీసులు లేకుండా మీటింగ్ పెడుతా : సీఎం రేవంత్ రెడ్డి

Published : Aug 25, 2025, 01:18 PM IST
Chandrababu Revanth reddy Meeting

సారాంశం

CM Revanth Reddy: ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రధాన అతిథిగా హాజరై విశ్వవిద్యాలయంలో నిర్మించిన కొత్త భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.

CM Revanth Reddy: ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రధాన అతిథిగా హాజరై విశ్వవిద్యాలయంలో నిర్మించిన కొత్త భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. మొత్తం రూ.90 కోట్లతో నిర్మించిన నూతన వసతి గృహాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూం భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓయూ లేకపోతే తెలంగాణ చరిత్రే లేదనీ, తెలంగాణకు ప్రత్యామ్నాయపదం ఉస్మానియా యూనివర్సిటీ అని పేర్కొన్నారు. 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది మహానీయులను అందించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వంటి నేతలను గుర్తు చేసుకున్నారు. ఆ మహానీయులు ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులేనని తెలిపారు.

కొంతమంది వ్యక్తులు ఓయూకు పూర్వ వైభవం లేకుండా చేయాలని ప్రయత్నించినా, తాము మళ్లీ ఆ ప్రతిష్టను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా దళిత వీసీని నియమించడం ద్వారా చరిత్ర సృష్టించామని ఆయన అన్నారు. దేశానికి యువత నాయకత్వం అవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటే ఊపిరి పోయిందనీ, యూనివర్సిటీలు కేవలం సమస్యలపై చర్చలకే కాకుండా, సామాజిక, సాంకేతిక అంశాలపై సిద్ధాంతపరమైన చర్చలకు వేదిక కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తాను ఉస్మానియా యూనివర్సిటీకి మళ్లీ వస్తాననీ, ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గరే సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతాననీ, అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపినా తాను ఏమీ అననీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్త శుద్ది ఉందన్నారు.

20 ఏళ్లలో ఉస్మానియాకు వెళ్లి ప్రసంగించిన తొలి సీఎం‌గా రేవంత్ రెడ్డి ఘనత సాధించారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేన్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, విద్యార్థులు ఆందోళనకు దిగుతారని సమాచారం అందడంతో, పోలీసు అధికారులు కొందరిని నిర్బంధించి స్టేషన్లకు తరలించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌