
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలకమైన రాజకీయ, న్యాయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపాలని సీఎం భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై న్యాయపరమైన స్పష్టత పొందేందుకు సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు.
పార్లమెంట్ సమావేశాల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికర పరిణామమేనని చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల అంశం సున్నితమైనదిగా మారింది. ఇప్పటికే దీనిపై పలు చర్చలు జరిగి, ప్రతిపక్షాలు కూడా తమ తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ తరపున సమగ్రంగా వాదించేందుకు, న్యాయ నిపుణుల సలహాలు పొందాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. మంగళవారం ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీ పాదయాత్రలో
ఢిల్లీ పర్యటన అనంతరం ఎల్లుండి (ఆగస్టు 27) సీఎం రేవంత్‌రెడ్డి బీహార్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌తో పాటు తెలంగాణ మంత్రులు కూడా రాహుల్ పాదయాత్రలో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇది బలాన్నిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.
వ్యూహాత్మక పరిమాణం
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన, ఆపై బీహార్ పాదయాత్రలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చలు జరగగా, మరోవైపు పార్టీ బలోపేతానికి దోహదం చేసే రాహుల్ పాదయాత్రలో భాగస్వామ్యం కావడం కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, రేవంత్ ఢిల్లీ పర్యటన, బీహార్ పాదయాత్రలో పాల్గొనడం తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది.