CM Revanth reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త ఏడాదిలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి సహకారంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
CM Revanth reddy: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ బృందం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2024ను రైతు-మహిళ-యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతోనే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టినట్లు రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.
"మేము ఇనుప గ్రిల్స్, బారికేడ్లను తొలగించాము, అన్ని ఆంక్షల నుండి విముక్తి చేసాం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టాము. ప్రభుత్వం ప్రజాస్వామ్య పునరుద్ధరణ, యువత భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చే దిశగా అడులేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ఆరింటిలో రెండు హామీలు అమలు చేశాం.. మరో నాలుగు హామీలను నూతన సంవత్సరంలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్షేమ ఫలాలను అందరికీ అందజేయాలని, అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలపాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు.
యువత సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఆధునిక సాంకేతికతతో ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, విద్యావ్యవస్థను సమూలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. స్తంభించిపోయిన పరిపాలనను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రజా భవన్‌లో ప్రజల మనోవేదనలను పరిష్కరించేందుకు ప్రజావాణి ప్రారంభించామని, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.
అనిశ్చిత స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖలో అవినీతిపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తుందని తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న వారి కలలు త్వరలో నెరవేరనున్నాయని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. ఈ ప్రభుత్వం 24x7 తలుపులు తెరిచింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని, పేదలకు ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త శకం ప్రారంభమైందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ అణచివేత, నియంతృత్వ పాలన తర్వాత మళ్లీ ప్రజాస్వామిక పాలనకు ప్రజలు బీజం వేశారని, రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు.