తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో సోనియా గాంధీ .. తెరపైకి కొత్త డిమాండ్ , ‘‘ సెంటిమెంట్‌ ’’తో రేవంత్ రాజకీయం

By Siva Kodati  |  First Published Jan 30, 2024, 9:59 PM IST

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేస్తారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.


త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేస్తారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోనియా నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని.. అప్పుడే తెలంగాణ ప్రజలకు ఇక్కడి పార్టీలు గౌరవం ఇచ్చినట్లని సీఎం అన్నారు. సోనియమ్మ నామినేషన్ వేసిన తర్వాత.. ఆమె మీద తెలంగాణ బిడ్డలెవరూ పోటీ చేస్తారని తాము అనుకోవడం లేదన్నారు. సోనియా తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అంతా సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా మంగళవారం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా పోటీకి సంబంధించి తాము తీర్మానం చేస్తే దానికి మీడియా ఖమ్మం అని జత చేసిందన్నారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలనే తీర్మానానికి తాము కట్టుబడి వున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

Latest Videos

ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి తనను కలవడంపైనా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ నియోజకవర్గ సమస్యలపై ఏ ఎమ్మెల్యే అపాయింట్‌మెంట్ అడిగినా ఇస్తానని సీఎం పేర్కొన్నారు. తాను లేనిపక్షంలో డిప్యూటీ సీఎం వుంటారని రేవంత్ చెప్పారు. వారు తమ తమ నియోజకవర్గాల ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావొచ్చునని ఆయన వెల్లడించారు. కేటీఆర్, హరీశ్ అడిగినా సమయం కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. 60 రోజులలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం వుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.  

అభ్యర్ధుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని, ఇప్పటికే పరిశీలకులను నియమించిందని రేవంత్ తెలిపారు. అభ్యర్ధులను ఎంపిక చేసి నిర్ణయం తీసుకునే అధికారాలను హైకమాండ్‌కు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని, మార్చి 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం వుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని , పెట్టుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో పండిన వరిని కూడా కొనలేని స్థితిలో కేంద్రం వుందని, కేవలం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశంలో వుండే ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో మోడీ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మాదిరిగానే కేంద్రంలో ప్రధాని మోడీ భారీగా అప్పులు చేశారని, విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి అధికారాన్ని అందుకోవాలని మోడీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలను నిలువరించేది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

తెలంగాణ గురించి కేసీఆర్ అడిగింది లేదు.. మోడీ ప్రభుత్వం ఇచ్చింది లేదని రేవంత్ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. కోదండరాం గొప్పతనాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించడం వారి భావదారిద్య్రాన్ని చూపిస్తోందని చురకలంటించారు. కేసీఆర్ దొడ్లో చెప్పులు మోసేవారితో కోదండరాంను పోలుస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. రాజకీయ కుట్రతో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. 
 

click me!