కోదండరాం ప్రమాణ స్వీకారం వాయిదా వెనుక కుట్ర : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Jan 30, 2024, 9:15 PM IST

ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా అపాయింట్‌మెంట్ ఇస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . కేసీఆర్ దొడ్లో చెప్పులు మోసేవారితో కోదండరాంను పోలుస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. రాజకీయ కుట్రతో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. 
 


ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా అపాయింట్‌మెంట్ ఇస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . కేటీఆర్, హరీశ్ అడిగినా సమయం కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా మంగళవారం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 60 రోజులలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం వుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.  

అభ్యర్ధుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని, ఇప్పటికే పరిశీలకులను నియమించిందని రేవంత్ తెలిపారు. అభ్యర్ధులను ఎంపిక చేసి నిర్ణయం తీసుకునే అధికారాలను హైకమాండ్‌కు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని, మార్చి 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం వుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని , పెట్టుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

Latest Videos

తెలంగాణలో పండిన వరిని కూడా కొనలేని స్థితిలో కేంద్రం వుందని, కేవలం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశంలో వుండే ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో మోడీ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మాదిరిగానే కేంద్రంలో ప్రధాని మోడీ భారీగా అప్పులు చేశారని, విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి అధికారాన్ని అందుకోవాలని మోడీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలను నిలువరించేది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఫిబ్రవరి 2 నుంచి ప్రజల్లో వుండేలా సభలు నిర్వహిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న జరగనున్న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను కేంద్రం నెరవేర్చలేదని, తెలంగాణ హక్కులను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రధాని మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని.. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ఒక్క రూపాయి కూడా వేయలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

తెలంగాణ గురించి కేసీఆర్ అడిగింది లేదు.. మోడీ ప్రభుత్వం ఇచ్చింది లేదని రేవంత్ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. కోదండరాం గొప్పతనాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించడం వారి భావదారిద్య్రాన్ని చూపిస్తోందని చురకలంటించారు. కేసీఆర్ దొడ్లో చెప్పులు మోసేవారితో కోదండరాంను పోలుస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. రాజకీయ కుట్రతో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. 

బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందని.. అలాంటి కాంగ్రెస్ చిత్తశుద్ధిని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారంటే ఆయన అవగాహన ఏంటో అర్ధమవుతోందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సీబీఐ విచారణ జరిపించవచ్చని డీవోపీటి కేంద్రం దగ్గరే వుంటుందని, రాష్ట్రం దగ్గర వుండదని రేవంత్ దుయ్యబట్టారు. వాళ్ల చేతిలో అధికారం పెట్టుకుని, కిషన్ రెడ్డి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. 

click me!