
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో డాక్టర్స్ కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్టుగా చెబుతున్నాయి. అయితే ఆయన గ్యాస్ట్రిక్ సమస్య నేపథ్యంలోనే ఏఐజీ ఆస్పత్రికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కవిత, మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి శనివారం రోజు కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో 8 గంటలకుపైగా విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకుని ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో కవిత చర్చలు జరిపారు.
ఇదిలా ఉంటే.. తొలుత కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురైనట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అందులో వాస్తవం లేదని.. వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వచ్చారని తెలిసింది.