ప్రధాని మోడీ, రాహుల్ గాంధీపై కామారెడ్డిలో సీఎం కేసీఆర్ విసుర్లు

కామారెడ్డి సభలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించారు. కరెంట్ అంశాన్ని పేర్కొంటూ ప్రధాని మోడీని, కాంగ్రెస్‌ను విమర్శించారు. మోడీ నియోజకవర్గంలోనూ 24 గంటల కరెంట్ లేదని అన్నారు. రాహుల్ గాంధీ ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా? అని ఫైర్ అయ్యారు.
 


కామారెడ్డి: సీఎం కేసీఆర్ ఈ రోజు కామారెడ్డిలో నామినేషన్ వేసిన తర్వాత ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచీ రైతు కేంద్రంగా మాట్లాడుతున్నారు. రైతు బంధు పెంచుతామని, రైతు బీమా ప్రతి ఒక్క రైతుకు అందుతున్నదని అన్నారు. స్వయంగా తాను కాపోణ్ణి అని చెప్పుకుంటున్నారు. అందుకే వ్యవసాయం గురించి, రైతుల సమస్యల గురించి తనకే ఎక్కువ తెలుసు అని, అందుకే వారి ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. దాదాపు ప్రతి చోటా ఆయన ముస్లింలను తన వైపు తిప్పుకునేలా ఉర్దూలో మాట్లాడుతున్నారు.

కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి తనపై పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటు నోటు కేసులో దొంగ అయినటువంటి వారు ఇక్కడ పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. రూ. 50 లక్షల రూపాయల సంచులతో పట్టుబడిన వ్యక్తి కావాలా? ప్రజలను కడుపులపెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్ కావాలా? అన్నారు. అదే విధంగా కేసీఆర్ ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలపై కామెంట్లు చేశారు.

Latest Videos

24 గంటల కరెంట్ అందిస్తున్నామని చెప్పిన కేసీఆర్ ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ 24 గంటల కరెంట్ లేదని అన్నారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ నేతలు ఏం ముఖం పెట్టుకుని ప్రచారానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల బావుల వద్ద, బోర్‌లు మోటర్లకు మీటర్లు పెట్టాలని మోడీ తనపై ఒత్తిడి చేశాడని, కానీ, చచ్చినా ఆ పని చేయబోనని స్పష్టం చేసినట్టు వివరించారు. అందుకు గాను రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్లను కేంద్రం కట్ చేసిందని తెలిపారు.

Also Read: పవన్‌పై అభిమానం సినిమాల వరకే.. రాజకీయాల్లో కాదు.. బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మూడు గంటలు కరెంట్ ఇస్తానని చెప్పేవారు కావాలా? 24 గంటలు ఇచ్చే తాను కావాలా? అని సీఎం కేసీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి ఎవుసం ఎరుకనా? ఎద్దు ఎరుకనా? అని ఎద్దేవా చేశారు. ఆయన వ్యవసాయం చేయగా తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. రైతు సమస్యల గురించి ఆయనకు ఏం తెలుసు? అని అన్నారు.

click me!