అరగంట ఎదురుచూశాం.. ఎట్‌హోమ్‌‌కు కేసీఆర్ రాకపోవడంపై తమిళిసై ఎమన్నారంటే..

By Sumanth KanukulaFirst Published Aug 16, 2022, 12:16 PM IST
Highlights

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ కార్యక్రమం హోస్ట్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు.

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తేనీటి విందులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ కార్యక్రమం హోస్ట్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. తొలుత ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని రాజ్‌భవన్‌‌కు సీఎంవో సమాచారం పంపింది. అయితే చివరి నిమిషంలో కేసీఆర్.. రాజ్‌భవన్‌కు వెళ్లాలనే ఆలోచనను విరమించుకున్నారు. 

ఈ పరిణామాలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్‌కు వ్యక్తిగతం లేఖ రాశానని చెప్పారు. అయితే ఆయన ఎందుకు రాలేదో తెలియదని అన్నారు. సీఎం సాయంత్రం 6.55 గంటలకు రాజ్‌భవన్‌కు వస్తారని.. ఆయన కార్యాలయం సమాచారం ఇచ్చిందని.. అయితే ఆయన రాకపోవడంపై ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కోసం.. తాను, హైకోర్టు సీజే ఎదురుచూశామని చెప్పారు. అందువల్ల కార్యక్రమాన్ని కూడా అరగంట ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. అదే సమయంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన వారికి ఆమె థాంక్స్ చెప్పారు. 

ఇక, ప్రభుత్వం తరఫున సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాత్రమే ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే సీఎం కేసీఆర్‌ను రిసీవ్ చేసుకోకునేందుకు సోమేశ్‌కుమార్ రాజ్‌భవన్‌కు వచ్చారని.. ఆయన కోసం ఎదురుచూశారని సమాచారం. కొంతసేపటి తర్వాత సీఎం కేసీఆర్ గైర్హాజరుపై ఆయన గవర్నర్‌కు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఇక,  కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత సీఎస్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా  సమాచారం. 

ఇక, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ మొదట నిర్ణయించుకున్నారని.. ఈ మేరకు రాజ్‌భవన్‌కు కూడా ఒక కమ్యూనికేషన్ పంపారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని సిద్ధంగా ఉంచారు. కొందరు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యమంత్రితో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రగతి భవన్‌లో వేచి ఉన్నారు. అయితే చివరి నిమిషంలో సీఎం కేసీఆర్.. రాజ్‌భవన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో దాదాపు గంటపాటు నిరీక్షించిన అనంతరం కాన్వాయ్‌ని మళ్లీ పార్కింగ్‌ ప్రదేశానికి తరలించారు. 

అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఎట్ హోం కార్యక్రమం..!
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రాక కోసం గవర్నర్ తమిళిసై  ఎదురుచూడడంతో ‘ఎట్ హోమ్’ దాదాపు అరగంట పాటు ఆలస్యమైనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి గైర్హాజరుపై సీఎస్ సోమేష్ కుమార్ సమాచారం అందించిన తర్వాత గవర్నర్ బయటకు వచ్చి ఆహ్వానితులను పలకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన 75 మంది విద్యార్థులకు రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్‌ తమిళిసై అవార్డులు, ప్రశంసాపత్రాలు అందించారు. నేటి విద్యార్థులు భవిష్యత్‌ తెలంగాణకు పిల్లర్లు అని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై చెప్పారు. విద్యార్థులకు తాను అండగా ఉంటానని తెలిపారు.

ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ల మధ్య  దూరం.. 
తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ల మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల వరకు రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.   అయితే గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడాన్ని గవర్నర్ నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో గవర్నర్, సీఎం మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్..  2021 డిసెంబర్‌లో ఎమ్మెల్యే కోటా కింద  కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 

2021 అక్టోబర్‌లో హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. ఆ తర్వాత కొన్ని నెలల పాటు రాజ్‌భవన్‌ వైపు వెళ్లలేదు. ఈ ఏడాది జనవరి 26న రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఏప్రిల్‌లో రాజ్‌భవన్‌లో జరిగిన అధికారిక ఉగాది వేడుకలను కూడా కేసీఆర్ హాజరు కాలేదు. జిల్లాల పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలపై గవర్నర్ తమిళిసై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది.

మహిళలు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి వీలుగా ఈ ఏడాది జూన్‌ నుంచి రాజ్‌భవన్‌లో ‘‘మహిళ దర్బార్‌’’ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఇది ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. అయితే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి జూన్‌లో రాజ్‌భవన్‌కు వచ్చారు. దీంతో భవిష్యత్తులో రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారనే ఊహాగానాలకు దారితీసింది. అయితే తాజాగా రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన "ఎట్‌హోమ్" కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవడంతో ఊహాగానాలన్నీ తప్పని రుజువైంది.

click me!