
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మధ్యాహ్నాం రాజ్‌భవన్ లో గవర్నర్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి. మెుదట గవర్నర్ కు వినాయకచవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర పర్యటన, రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలు, ఇతర పాలనా అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. కొండగట్టు ప్రమాదం, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం, క్షతగాత్రులకు వైద్య సహాయం వంటి అంశాలను సీఎం గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. దీంతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి పాలన విధించాలంటూ విపక్షాలన్నీ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ ఉంటే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగవని విపక్షాలు ఆరోపించని విషయంపై చర్చించారు.
ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ తాము విధానపర నిర్ణయాలు ఏవీ తీసుకోవడం లేదని.. రాజ్యాంగ బద్ధంగానే నడుచుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు వివరించినట్లు సమాచారం.