
హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అవుతుంటే మరోవైపు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తూనే ఉన్నాయి. తాము కూడా ఎన్నికల సమరానికి సై అంటూ సవాల్ విసిరేందుకు కొత్త పార్టీ అధినేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే జాబితాలో బీసీ సంఘం నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య చేరారు. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ఆర్ కృష్ణయ్య ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా బీసీల కోసం చేసిందేమీ లేదని ఆర్ కృష్ణయ్య ఆరోపిస్తున్నారు. బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తూ లబ్ధి పొందుతున్నారే తప్ప వారి అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికే బీసీ సంఘాల నుంచి పార్టీ పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారని అందువల్ల పార్టీ పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
కొత్త పార్టీకోసం బీసీలు తహతహలాడుతున్నారని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే మేధావులతో చర్చించానని బీసీ వాదం బలంగా ఉన్న నేపథ్యంలో పార్టీ పెట్టాల్సిందేనని అంతా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారని భవిష్యత్ లో కూడా అవకాశం ఇస్తారో లేదో అన్న ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఒక్కసారి బీసీలు ముఖ్యమంత్రి కాలేదని వాపోయారు.
ఇటీవల కేసీఆర్ ప్రకటించిన సీట్లలో కేవలం బీసీలకు 20 మందికి కేటాయించారని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతున్న 60 మంది జాబితాలో కేవలం 18 మంది బీసీలు ఉండనున్నారని ఇలా చూస్తే బీసీలకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 52శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షలా మారిందని ఆర్ కృష్ణయ్య వాపోయారు.
బీసీల మనుగడ కోసం పార్టీ పెట్టాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. తమ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో దృష్టి సారించినట్లు తెలిపారు. తాము ఏ ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ప్రాంతీయ వాదం బలపడటానికి నెలల సమయం పడుతుందని మతవాదం బలపడటానికి ఆరు నెలల పడుతుందని బీసీ వాదం బలపడేందుకు నెలరోజులు సరిపోతుందన్నారు.