గజ్వేల్ స్థానంపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేసినట్టు తెలుస్తున్నది. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ బీసీ కమ్యూనిటీని, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకుని కేసీఆర్‌ను ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. దీంతో అలర్ట్ అయిన సీఎం కేసీఆర్ ఈ వర్గంలో తన పట్టును నిలుపుకోవాలని వ్యూహం రచించినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో బిజీగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి రోజు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన క్యాంపెయిన్‌లో మునిగిపోయి ఉన్నారు. అయితే.. ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిల్లో ఇంకా ప్రచారం చేయలేదు. గజ్వేల్‌లో ఇప్పటికే ఈటల రాజేందర్ బీజేపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
గజ్వేల్‌లో ఈటల రాజేందర్ టార్గెట్‌గా కేసీఆర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన గజ్వేల్ నియోజకవర్గంలోని ముదిరాజ్ సముదాయాన్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. గజ్వేల్‌లో ప్రజా వ్యతిరేకత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ముదిరాజ్ వర్గం కూడా కేసీఆర్ పై వ్యతిరేకతను వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ముదిరాజ్ వర్గానికి కేసీఆర్ అన్యాయం చేశారని ఈటల రాజేందర్ ఫైర్ అవుతున్నారు.
undefined
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముదిరాజ్ వర్గంలో తన పట్టును నిలుపుకోవడానికి స్ట్రాటజీ ప్రారంభించారు. ఈ రోజు ఉదయం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరినీ నాయకులుగా ఎదగనివ్వలేదని ఆరోపించారు. అందుకే తాము బండ ప్రకాశ్‌ను తీసుకువచ్చి పదవులిచ్చామని చెప్పారు. ఇప్పుడు కాసానిని పార్టీలోకి తీసుకున్నామని, ఈటల రాజేందర్ కంటే కాసాని పెద్ద మనిషి అని వివరించారు.
Also Read : మై లార్డ్ అనడం ఆపవా.. నా సగం జీతం ఇస్తా: న్యాయవాదితో సుప్రీం కోర్టు జడ్జీ
రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులనూ ముదిరాజ్‌లకు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. అంతేకాదు, ముదిరాజ్‌ల నుంచి నాయకులు తయారు కావాలని వివరించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ముదిరాజ్‌లతో సమావేశం అవుతానని అన్నారు. తమ హయాంలో ముదిరాజ్‌లకు న్యాయం జరిగిందని వివరించారు.
దీంతో గజ్వేల్ కేంద్రంగా ముదిరాజ్‌లను తన వైపే నిలుపుకునేలా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు నాయుడు అనడంతో జీర్ణించుకోలేక పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులందరినీ ప్రకటించిన బీఆర్ఎస్‌లో ఆయన చేరడంతో నామినేటెడ్ పోస్టులు లేదా ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ అవకాశాలను హామీ ఇచ్చి ఉంటారనే చర్చ జరుగుతుంది. ముదిరాజ్ వర్గాన్ని బలపరుచుకో వడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.