గవర్నర్ వ్యవస్థతో రాజకీయాలు, కార్పోరేట్లకు దేశ సంపద.. కేంద్రం తీరును ఎండగట్టండి : ఎంపీలకి కేసీఆర్ దిశానిర్దేశం

By Siva KodatiFirst Published Jan 29, 2023, 8:22 PM IST
Highlights

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌లో బీజేపీపై పోరాటానికి కలిసి వచ్చే ప్రతి ఒక్క పార్టీ ఎంపీని కలుపుకుని పోవాలని కేసీఆర్ సూచించారు
 

తెలంగాణ హక్కులపై పార్లమెంట్‌లో గొంతెత్తాలని ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎల్లుండి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. విభజన హామీలను కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని.. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానంపై పార్లమెంట్‌లో ఎండగట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. దేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. 

ALso Read: ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయం

బీఆర్ఎస్‌తో కలిసొచ్చే పార్టీలతో ఆందోళనలు చేయాలని.. బీజేపీ విధానాలు దేశ సమగ్రతకు ఆటంకంగా మారాయన్నారు. దేశ సంపద కార్పోరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారని.. ఎల్ఐసీ వాటాలను అదానీ లాంటి వ్యాపారవేత్తలకు అప్పగించారని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు వాటి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతోందని.. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని సీఎం దుయ్యబట్టారు. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని.. కేబినెట్, అసెంబ్లీ నిర్ణయాలను బేఖాతరు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. గవర్నర్లను కేంద్రం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. కేంద్రం తీరును ఉభయ సభల్లో వ్యతిరేకించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌లో బీజేపీపై పోరాటానికి కలిసి వచ్చే ప్రతి ఒక్క పార్టీ ఎంపీని కలుపుకుని పోవాలని కేసీఆర్ సూచించారు. 
 

click me!