
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో పరిస్థితిని ఇంద్రకరణ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సాయం అందించేందుకు వీలుగా హెలిప్యాడ్‌లను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు.
ఇక, భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. జనగామ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో.. భారీ వర్షాలు, వరదల తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, అంటు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని మండి బజార్ లో పాత భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రెబల్లి దయాకర్ రావు పరామర్శించారు. పాత భవనాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.