
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఉద్యమ సమయంలో ఆంధ్రా పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుడ్డారు. తెలంగాణ కు అడ్డు పడుతున్న అక్కడి నేతలపై మాటల తూటాలు పేల్చారు.
ఆంధ్రా బిర్యానీ పేడాల ఉంటుందని అన్నా... లంకలో పుట్టినవాళ్లు అంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు అన్నా ఆయనకే చెల్లింది.
ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలపై ఆంధ్రా నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత నెమ్మదిగా పరిస్థితి మారుతోంది.
అమరావతి నిర్మాణ సమయంలో భూమి పూజకు వచ్చిన కేసీఆర్ కు ఆంధ్రా ప్రజలు ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆహ్వానం పలికారు.
ఇటీవల కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత అమరావతిలో ప్రసంగించినప్పుడు కూడా అక్కడ మహిళలు చప్పట్లతో ఆమె ప్రసంగానికి జై కొట్టారు.
ఈ రోజు కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని చోట్ల తెలంగాణ సీఎం జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహిస్తుండటం గమనార్హం.
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ అభిమాన సంఘం నేత ఖాదీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అన్నదానం కూడా చేశారు.
ఇదే స్ఫూర్తి ఇరు రాష్ట్రాల నేతల మధ్య ఉంటే ఇప్పటికే విభజన సమస్యలు పూర్తిగా సమసిపోయేవి. కానీ, ఎవరి రాజకీయం వారిది.