
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బృందానికి తిరుపతిలో ఘనస్వాగతం లభించింది. ఏపీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ తదితరులు రేణుగుంట విమానాశ్రయానికి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు పయనమయ్యారు.
తిరుమలలోని శ్రీ కృష్ణ అతిథిగృహంలో సీఎం కుటుంబసభ్యులకు, మంత్రులకు బస ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా కేసీఆర్ తిరుమలకు వస్తుండటంతో కొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్ నగర మేయర్ రాంమోహన్ నిన్ననే తిరుమలకు చేరుకొని కేసీఆర్ బస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోనున్నారు.