కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
హైదరాబాద్: కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కరోనా వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సిఎం వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్స లోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తాజా రిజ్వి, ఆరోగ్యశాఖ వివిధ విభాగాధిపతులు కరుణాకర్ రెడ్డి, రమేశ్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
undefined
జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉంది,రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్ సోకింది. అందులో 27,295 మంది (67శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని సీఎం చెప్పారు.
దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నది. ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చిందని సీఎం తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం చెప్పారు. హైదరాబాద్ లోని గాంధి, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేసినట్టుగా ఆయన తెలిపారు.
అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించామన్నారు.1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించినట్టుగా సీఎం ప్రకటించారు. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ అమలు చేయాలని నిర్ణయించారు. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్టుగా సీఎం ప్రకటించారు. ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించామన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అందించే పదిశాతం అదనపు వేతనం (కోవిడ్ ఇన్సింటివ్) కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్య సిబ్బందికి ఇన్సెంటివ్ లకు కొనసాగిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పిజి పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను కోరారు. కరోనా సోకిన వారికి అందించే వైద్యంలో భాగంగా వేసే రెయ్ డిస్ట్రిర్, టో సిలిజుమాబ్ ఇంజక్షన్లు, ఫావి పిరావిర్ టాబ్లెట్లను పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం హెచ్చరించారు. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాలను బహిరంగ పరచాలని ఆయన ఆదేశించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందించాలని ఆయన కోరారు.