మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఇవాళ భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని తుమ్మల నాగేశ్వరరావును మల్లు భట్టి విక్రమార్క ఆహ్వానించారని సమాచారం.
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఆదివారంనాడు భేటీ అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఆహ్వానించేందుకు వచ్చినట్టుగా సమాచారం. ఈ నెల మొదటి వారంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ నాయకత్వం పాలేరు అసెంబ్లీ టిక్కెట్టును కేటాయించలేదు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
పాలేరు అసెంబ్లీ స్థానంనుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం చేసుకున్నారు. కానీ ఆయనకు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుండి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తిని చూపుతున్నారని ఆయన వర్గీయుల్లో ప్రచారంలో ఉంది. గత వారం రోజులుగా తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి ఆయన అనుచరులు సమావేశమౌతున్నారు. ప్రజా క్షేత్రంలో ఉండాలని తన అనుచరులకు తుమ్మల నాగేశ్వరరావు సూచిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఆయన వెంట నడుస్తామని ఆయన అనుచరులు తేల్చి చెబుతున్నారు.
గత వారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఈ నెల 1వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బెంగుళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.ఈ నెల 2వ తేదీన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఇవాళ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రిని ఆహ్వానించేందుకు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారని చెబుతున్నారు.
also read:కాంగ్రెస్‌లోకి తుమ్మల: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పట్టుంది. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే రాజకీయంగా ఆ పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటే నడుస్తామని ఆయన అనుచరులు కూడ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిణామాలను బీఆర్ఎస్ కూడ నిశితంగా పరిశీలిస్తుంది.